వచన కవితలు


 శిలువ బ్రతుకు
ఒక్కొక్కరిది ఒక్కో మార్గం.
కొందరిది దుర్మార్గం
మరికొందరిది సన్మార్గం
పాపం ఆ పసివాడ్ని   
దారిద్ర్యం దత్తతు తీసుకుంది...

నలుగురు నడిచే మార్గంలో 
దయ గల చూపులు 
కాసులు రాలుస్తాయని
ఆకలి తీరుస్తాయని 
బోర్డుపై సుద్దముక్కలా
రోడ్డుపై బాల్యాన్ని అరగదీస్తున్నాడు...
దేవుళ్ళను సృష్టిస్తున్నాడు...

కోట్ల దేవుళ్ళున్న ఈ దేశంలో
కోటానుకోట్ల భక్తుల్లో
కొందరైనా కాసులేయరా అని 
ఆశపడ్డాడు.
ఆకలి తీరలేదు
ఆకలి ఎక్కువైయ్యే కొద్దీ 
దేవుడు కళా విహీన మవుతున్నాడు
దూళితోనే కాదు 
పసివాడి ఆకలి ఆర్తితో ...

అందరూ 
చివరికి నడిచేమార్గం ఒకటే అయినా 
ప్రస్తుతానికి ఆ మార్గం
పసివాడి బ్రతుకు ప్రయాణానికి
పరలోక మార్గం
ఆశల స్వర్గం...

పునరపి క్షుద...పునరపి నిద్ర ...
ఎన్ని నిద్రలో...
ఎన్ని మెలకువలో...
తల్లి గర్భగుడిని 
దాటినది మొదలు
ఆకలి నిద్రలు
జీవన పోరాట యోధులు. 
రగిలే ఆకలి
నిద్రపోనివ్వని అగ్నికణం.
క్రిమికీటకాలు మొదలు
సకల జీవరాసుల
దైనందిన పోరాటం...

బ్రతుకు లేకుంటే
ఆకలి ఉండేది కాదు!
ఆకలి లేకుంటే 
రుచి తెలిసేది కాదు!!
మరణానికి బ్రతుకు రుచి
మనిషికి చేదు
పునరపి క్షుద 
పునరపి నిద్ర
ఎడతెగని సంవత్సరాల పెనుగులాటలో
ఓడేది ఆకలి నిద్రలు!
గెలిచేది మరణం!!
(హైకూ క్లబ్ సభ్యులు శ్రీ వెంపరాల నరసింహ మూర్తి వారి దివ్య స్మృతికి...)
శ్రీ వెంపరాల నరసింహ మూర్తి