మినీ కవితలు
అరణ్యంలో
సకల జీవుల్నీ సంహరించేవి
సింహాలు!
జనారణ్యంలో
సామాన్యుల్ని హరించేవి
నర సింహాలు !!
అమీబాలు
పేరుకు
పేదల పార్టీ
పెత్తనం మాత్రం
పెద్ద కులపోళ్ళదే !!
ఇ.వి.ఎమ్
ఒక్కసారినొక్కి
నాయకుడ్ని నిర్ణయిస్తారు
ప్రజలు
సంవత్సరాలపాటు నొక్కేస్తూ
ప్రజా ధనాన్ని మింగేస్తారు
ప్రజా ప్రతినిధులు
'సం'క్షేమం
గోరుముద్దల
రుచి
వార్డెన్ పిల్లలవరకే!
పురుగులన్నం
పచి
హాస్టల్ పిల్లలకెరుకే!!
ఆ కలి
సిల్వర్ కలర్
దేశమంతా తెగ ఖర్చవుతుంది
ఆరాతీస్తే తెలిసింది
ఆకలిలోంచి
బాల గాంధీలు పుట్టుకొస్తున్నారని
* * *
తక్షణ చికిత్స అవసరం
రోగులకు కాదు
అవినీతి జబ్బు పట్టిన
సర్కారు ఆసుపత్రులకు
* * *
దబ్బున్నోడికే
ఎలక్షన్లో సీటు
గెలిచాక అవినీతే
వాడికిష్టమైన స్వీటు
* * *
(అ)మాయికులు
నాయకుల్ని విశ్వసిస్తూ
నష్ట పోయే ప్రజలు
ప్రజల్ని నమ్మిస్తూ
లాభపడే నాయకులు
* * *
కార్యాలయాలు
కాసులిస్తే చాలు
కాళ్ళు వస్తాయి ఫైల్స్ కి
ఫైల్స్ వచ్చేలా కూర్చొని
పనిచేస్తాయి.
అవి నీతికి ఆలయంగా
ఉండాల్సింది పోయి
అవినీతి కార్యాలయాలుగా
పనిచేస్తునాయి
కాసుల ముందు అందరూ
దాసులే !
నక్కలు - గొర్రెలు
లోటేలేదు
నక్కలకు
అవివేకపు
గొర్రెలున్నంత కాలం...
రాజకీయ నాయకుడు
ఓట్లతో
మనుషుల్ని
కొలిచేవాడు
రహస్య స్థావరం
ఉన్నట్టుండి
కొందరు దొంగలు
కనబడడం మానేశారు!
ఎన్నికలయ్యాక
స్థావరం మార్చారు ...
యుద్ధం
కూలేవి
భవంతులు కావు
బతుకులు!
గ్రేటిండియా
పన్నెండేళ్ళకోసారే
పవిత్ర కుంభమేళ
రోజుకెన్నెన్నో
అపవిత్ర కుంభకోణాలు ...
రెడ్ లైట్ ఏరియా
అక్కడ ఎన్నెన్నో
ఆకలి కోరలలో చిక్కి
కామందుల నఖచ్చేదనతో
రక్తం ఒలుకుతున్న
మాంసపు ముద్దలు
ఓ ప్రమాద సూచిక కూడలిగా
(అ)సభ్య సమాజం పెట్టిన పేరు
పేపరుకెక్కాడు
పేద రైతు పేరుకూడా
పేపర్లో పడింది
ఏదో సాధించాడని కాదు
కుదవపెట్టిన పెళ్ళాం పుస్తెలు
బ్యాంక్ వాళ్ళ వేలం ప్రకటనలో ...
అటెన్షన్
ఎన్నికల నోటిఫ్ కే షన్ కోసం
నిరుద్యోగుల నిరీక్షణ
ఓటుహక్కు వినియోగం కోసం కాదు
ఉద్యోగ అవకాశాల
నోటిఫ్ కే షన్ కోసం...
సన్మాన పత్రం
గోరంత
కొండంత
రూప'కల్పన'
జీవితార్థం
జీవితాన్ని
గాయాల కొలబద్దతో
కొలుచుకుంటూ పొతే
మరుభూమి గమ్యం
చేరుకుంటావు
మాయని మచ్చల్ని
పాఠాలుగా పఠిస్తూ పొతే
జీవితార్థానికి
నిఘంటువు అవుతావు...
మతం గజ్జి
ఆలయ ప్రవేశం లేదంటారు
ఆదరించి చేరదీసినవాడ్ని అనుసరిస్తే
మత మార్పిడంటారు
మందేలేదేమో
వీళ్ళ జబ్బుకి