06 October 2010

సాహితీ హైకూలు - Saahithee Haiku

డా.తలతోటి పృథ్వి రాజ్
సాహితీ హైకూలు

పాలకూరలా
పంటికింద పద్యం
రుచి మధురం

అడుగడుగు
గ్రాంధికం పాలిట
అగ్గిపిడుగు

వినిపించును
ఇక ఆ ఇంద్రునికే
తన గొడవ

సాహితీ క్షేత్రం.
వడ్ల గింజలతోటి
కథల సాగు...

వీణా సుశిల్పి
వాణీ వైభవ మూర్తి
సంగీత నిధి

రూపుదిద్దాడు
కవితా కన్యకను
జడకుచ్చుల్తో...

అతిమధురం
సాహిత్య మొర్మొరాలు...
తాపీగా తిను

పల్లెపల్లెల
సాహితీ సిరిదివ్వె
అద్దేపల్లి

అస్తమించాడు
రక్తరేఖలు గీసి
ప్రభాకరుడు

అవినీతిని
నగ్నంగా ఉరేగిస్తూ
కవితాముని

భాషా సామ్రాజ్యానికి
మకుటంలేని రారాజు
~భద్రిరాజు

అదే సొత్తుగా
కథల భాండాగారం
కారాదంటారా?

నాటక రంగం.
స్త్రీపాత్రలో తనదే
అగ్రస్థానం

మినీ కవితల
రావిచెట్టు నీడన
సేదతీరుతూ...

మాకినీడు
కువిమర్శ నీలినీడల్ని మాపే
సుర్యభాస్కరుడు

ప్రజా గాయకుడు
ఖద్దరు తొడగని
ప్రజాప్రతినిధి

స్వామి
వచన కవితా ధారణలో
ఆసామి

పద్యాలతోరణం
తనకు పోటీ ఏ పాటీ
లేనేలేదు సాటి

పానశాలలో
మత్తుగా పాఠకులు
ఎవ్వరీ కవి ?!

మువ్వల కర్ర
వచన రచనకు
ఓ శిరోమణి

శృంగార భావం
బంగారంగా మలిచి
గజల్ షరాబు

పాటను చూస్తే
పండు మిరపే
~వంగపండు

అరకు హైకూలు - Araku Haiku


డా. తలతోటి పృథ్విరాజ్
అరకు హైకూలు

అరకు నట్టింటిలోకి రమ్మని
తెలుగింటి పసుపుపచ్చ గడపలా
వలెసపూల ఆహ్వానం
* * *
దొరికేది ఇక్కడే
చే'జారిన'బాల్యం
~చాపరాయి

* * *
మహారాజుల్లా
మబ్బుల కిరీటాలతో...
~తూర్పు కనుమలు
* * *
దేవలోకంలోంచి అరకు లోయలోకి
జారిపడ్డ పసుపుపచ్చ తివాచీలు
వలెస పూదోటలు

* * *
ఇక్కడ ప్రతిధ్వనిస్తాయి
పక్షుల కూతలేకాదు...
తుపాకుల మోతలూ!
* * *
మొగ్గల శిశువులు
వికసిస్తూ రాలే వృద్ధ కుసుమాలు
ఆశ్రమ పుష్పశాల పద్మాపురం గార్డెన్

* * *
ఎదురు చూస్తున్నాయి
వేకువకై పచ్చని చెట్లు
పూల తివాచీపరిచి
* * *
స్వర్గం,నరకం ఒకే చోట
~అరకు ఏజెన్సీ
అడవి అందాలు-అంటువ్యాధులు

* * *
రెండురోజుల యాత్రికులమే మనం
రెండు మాసాల అరకు యాత్రికులు
తేనెటీగలు-సీతాకోకలు
* * *
అడవితల్లి
అందాల పాపిట
గోస్తనీ నది

* * *
వర్ణనాతీతం ...
మేలి ముసుగుతో మన్యం
~హేమంతం...
* * *
గూడేల గుండెలన్నీ
కలుసుకునే కూడళ్ళు
సంతలు...

* * *
వెన్నెల ఆహారం...
స్వర్ణ వెన్నెల
వలిసెపూలు...
* * *
ఆదివాసుల
జీవన వైవిధ్య దర్పణం
మ్యూజియం

* * *
తూర్పు కనుమలు...
అరకు అందాలు...
గిరిజనుల లోగిళ్ళు!
* * *
అసలే వంపుసొంపుల ఘాటీ
రోడ్డుకిరువైపులా వలెస పూదోటలు
రెండుకళ్ళూ చాలలేదు

* * *
నీరే ఉలిగా ప్రకృతి శిల్పి
చెక్కిన కళా ఖండం
బొర్రా గుహలు
* * *
అందాల అడవి కన్య
జారిన పైటకొంగు
జలపాతం...

* * *
ఉషోదయ వలిసె కుసుమాలు
మంచు బిందువులతో బరువుగా-మత్తుగా
జీలుగుకల్లు తాగినట్లు...
* * *
ధింసాకే కాదు
హింసకు మన్యం వేదిక
ఎన్ కౌంటర్లు...

* * *
పోడు వ్యవసాయం.
గిరుల శిల్పాల్ని చెక్కే గిరిజనులు
కర్షక శిల్పులు