కూనలమ్మ పదాలు - Koonalamma Padaalu


  డా. తలతోటి పృథ్విరాజ్ 
 కూనలమ్మ పదాలు 
 
కొరివిపెట్టును సుతులు
కూడు పెట్టు కూతులు
ఆడ బిడ్డలె మేలు  
ఓ కూనలమ్మ!
 
రోదసికి రాకెట్లు 
నేలకొరిగే చెట్లు 
ఓజోన్ పొరకు తూట్లు 
ఓ కూనలమ్మ! 
 
చదవడం ఒక సొత్తు 
బతకం ఒక ఎత్తు 
జీవితం గమ్మత్తు 
ఓ కూనలమ్మ!
 
ఓట్లు ఇచ్చును హక్కు
నోట్లు పంచిన దక్కు
కోట్లు నేతలు నొక్కు
ఓ కూనలమ్మ! 
 
కనుమరుగు రాట్నాలు 
విరివిగా కట్నాలు 
ఎదుగునా పట్నాలు
ఓ కూనలమ్మ! 
 
చదువుకుంటే చాలు
కలుగునెంతో మేలు 
తొలగు నీలో డీలు 
ఓ కూనలమ్మ! 
 
పిల్లలకు పరీక్షలు
భక్తులకీ దీక్షలు 
దొరలకేవి శిక్షలు
ఓ కూనలమ్మ! 
 
తగ్గి ఉండుట మంచి 
మంచి నిలుపుము పంచి
పంచి పెంచు సహించి
ఓ కూనలమ్మ!
 
బాల్యదశలో బడికి
వయసులో సఖి ఒడికి
వార్ధక్యాన గుడికి 
ఓ కూనలమ్మ!
 
నివురు కప్పు నిప్పును
తప్పు మింగు ఒప్పును
నీతి కనులు విప్పును
ఓ కూనలమ్మ!
 
జీవితం  నాటకం 
మమతలూ బూటకం
జననమరణ గమకం
ఓ కూనలమ్మ! 
 
హృది ఆశ చిత్తడి 
మమతల మది ఇత్తడి
మానవతే పుత్తడి
ఓ కూనలమ్మ! 
 
లోకాన్ని పసిగట్టు
సత్యాన్ని కనిపెట్టు
దురాత్ముల పనిపట్టు
ఓ కూనలమ్మ! 
 
ఆ-డది కాదాడది 
మమతల తడి ఆరనిది
ఇలలొ   దేవతైనది 
ఓ కూనలమ్మ! 
 
పోలీసులు - దొంగలు 
రౌడీలు - నాయకులు 
ఆదర్శ స్నేహితులు
ఓ కూనలమ్మ!
 
కలిపేయును పొత్తులు
విడదీయును  ఎత్తులు
రాజకీయ జిత్తులు 
ఓ కూనలమ్మ! 
 
కావు జన పత్రికలు 
పార్టీల పుత్రికలు 
ఫోర్త్  ఎస్టెటస్థికలు
ఓ కూనలమ్మ!
 
ఖనిజాలతో గనులు
దోచి దాయును ఘనులు 
డీల్ కుదిరిన దొంగలు 
ఓ కూనలమ్మ!
 
మూడు రంగుల జెండ
అవాలి పేదలండ
ఇకదే మన అజెండ
ఓ కూనలమ్మ!
 
గడ్డి  మేసెను లాలు
గద్దెక్కె ఇల్లాలు 
పదవిలేదా సోలు 
ఓ కూనలమ్మ!
 
బాబ్రీని కూల్చింది 
ఐఖ్యతను పూడ్చింది
కమలమే కమిలింది
ఓ కూనలమ్మ!
 
మాయావతి మాయలు
మూలా'యముని'లీలలు
సిగ్గులేని నేతలు 
ఓ కూనలమ్మ!
 
పేరు చివరన కులం 
మెడలో గోల్డు తులం 
కావవి  మన శీలం 
ఓ కూనలమ్మ!
 
పి.ఎం.తుమ్మిన చాలు 
యు.ఎస్.దగ్గిన వాలు 
షేర్లు బూడిద పాలు 
ఓ కూనలమ్మ!
 
భూతాపం పట్టదు
కాలుష్యం  గిట్టదు 
నివారణే  తట్టదు
ఓ కూనలమ్మ!
 
యు.ఎస్.అగ్రవాదం 
పాక్ ది ఉగ్రవాదం 
మానవతే వేదం 
ఓ కూనలమ్మ!
 
కర్షకుల కన్నీరు 
శ్రమశక్తి మున్నీరు 
దళార్లకు పన్నీరు 
ఓ కూనలమ్మ!
 
దైవం వ్యాపారము 
భక్తులూ అపారము 
మతకలహాల దురము 
ఓ కూనలమ్మ!
 
లేదు  నీతి నేతకు
రాదుగా మతి ప్రజకు 
కులం కత్తి నేతకు 
ఓ కూనలమ్మ!
 
తెల్లదొరలు  పోయెను 
నల్లదొరలు వచ్చెను 
దోపిడీలు హెచ్చెను 
ఓ కూనలమ్మ!
 
ధరలు ధరపై లేవు 
దేశమంతా కరువు 
ప్రభుకు వెతలు చేరవు 
ఓ కూనలమ్మ!
 
కాదు  ప్రజారాజ్యం 
లేదు ప్రజాస్వామ్యం
దేశ ప్రగతి  పూజ్యం 
ఓ కూనలమ్మ!
 
సెల్  ఫోన్లలో సొల్లు 
టాక్ టైం నిల్వ నిల్లు
జేబులకింక చిల్లు 
ఓ కూనలమ్మ!
 
లేదిల దేశభక్తి
అంతా దైవభక్తి
ఉత్సవాల్లో  రక్తి 
ఓ కూనలమ్మ!
 
పుచ్చుకొనుట ఇష్టం
ఇచ్చుకొనుట కష్టం
కట్నాదులు భ్రష్టం  
ఓ కూనలమ్మ!
 
నేతకు పదవి మెట్టు
పేదకు పెదవి గట్టు
అంతరం లోగుట్టు 
ఓ కూనలమ్మ!
 
గడ్డి తినే నేతలు
కాపలాగ కుక్కలు
చుట్టాల చట్టాలు 
ఓ కూనలమ్మ!